: పంటి నొప్పి ఒక్కసారిగా గుండెపోటెలా అయ్యింది చెప్మా?!.. భుజ్ బల్ పై విచారణకు ఆదేశం


అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజ్ బల్ మరో చిక్కులో పడ్డారు. పంటి నొప్పిగా ఉందని జైలు అధికారులకు చెప్పి ప్రభుత్వ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు వెళ్లేందుకు అనుమతి తీసుకుని బయటకు వచ్చిన ఆయన, ఆపై తనకు గుండెల్లో నొప్పిగా ఉందని చెబుతూ, పక్కనే ఉన్న సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చేరడంపై మహా సర్కారు విచారణకు ఆదేశించింది. ఆయన వాస్తవంగానే గుండె నొప్పితో బాధపడుతున్నారా? లేక జైలు జీవితం నుంచి ఉపశమనాన్ని పొందేందుకు నాటకం మొదలుపెట్టారా? అన్నది తేలుస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఆసుపత్రి అధికారుల వైఖరిపైనా విచారణ జరుపుతామన్నారు. సెయింట్ జార్జ్ ఆసుపత్రిపై గతంలోనూ ఇదే తరహా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీ నుంచి హౌసింగ్ స్కాములో అరెస్టయిన మాజీ మంత్రి సురీశ్ దాదా జైన్ వరకూ జైలు నుంచి అనారోగ్యం పేరిట ఈ ఆసుపత్రిని ఆశ్రయించి సకల సుఖాలనూ పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. భుజ్ బల్ కేసులో జైళ్ల శాఖ ఐజీ బిపిన్ కుమార్ సింగ్ నేతృత్వంలో అదనపు డీజీపీ బీకే ఉపాధ్యాయ్ విచారణ జరుపుతారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News