: 'ఇన్ క్రెడిబుల్ ఇండియా'... అమితాబ్ ఔట్ - ప్రియాంకా చోప్రా ఇన్!


ఇన్ క్రెడిబుల్ ఇండియా (అతుల్య భారత్)... అంతర్జాతీయ యవనికపై ఇండియాకు మరింత ప్రాచుర్యం తీసుకువచ్చి, మరింత మంది విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రచారం. ఈ బాధ్యతలను భుజాన వేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పదవీకాలం ముగియడంతో, ఆపై ఆయన్ను కొనసాగించే ఉద్దేశం లేదని టూరిజం శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆయన స్థానంలో బిగ్ బీ అమితాబ్ ను నియమించడం ఖాయమని, అమితాబ్ పేరు ఖరారైందని వార్తలు వచ్చిన వేళ, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ లో ఆయన పేరు వచ్చింది. ఇండియాలో పన్ను చెల్లించకుండా, డబ్బును విదేశాలకు తరలించి దాచుకున్నారన్నది ఆయనపై ఆరోపణ. ఈ నేపథ్యంలో అమితాబ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటే, విమర్శలు ఎదురవుతాయని భావిస్తున్న టూరిజం శాఖ చూపు తాజాగా ప్రియాంకా చోప్రా వైపు చూస్తున్నట్టు తెలుస్తొంది. ఇటీవల పీపుల్స్ చాయిస్ అవార్డును ప్రియాంక దక్కించుకోవడం, ఆస్కార్ వేదికపై మెరవడం, దేశంలోని ప్రజలందరికీ తెలిసుండటం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఆమెకు ప్లస్ పాయింట్లని భావిస్తున్న టూరిజం అధికారులు ఆమెను ఇన్ క్రెడిబుల్ ఇండియాకు ప్రచారకర్తగా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక దీనిపై అధికార ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

  • Loading...

More Telugu News