: అరేయ్!... ఒరేయ్!: లైవ్ షోలో తిట్టుకున్న బొండా, చెవిరెడ్డి


వారిద్దరూ శాసనసభ్యులు. ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికై అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న నేతలు. ఒకరు అధికార పక్షం టీడీపీకి చెందిన నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కాగా, మరొకరు విపక్షం వైసీపీకి చెందిన నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి. కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు న్యూస్ చానెల్ నిర్వహించిన చర్చ సందర్భంగా లైవ్ షోలోనే తమ స్థాయి మరిచి వ్యవహరించారు. ఒకరినొకరు దూషించుకున్నారు. తిట్టుకున్నారు. అరేయ్... ఒరేయ్ అంటూ సభ్యత సంస్కారాలు మరిచి మాట్లాడారు. ఓ వైపు షో నిర్వాహకుడు వారిస్తున్నా వారిద్దరూ వినిపించుకున్న పాపాన పోలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర విషయాల్లో కేంద్రం చేస్తున్న జాప్యం, నిర్లక్ష్యంపై జరుగుతున్న చర్చలో తొలుత బొండా ఉమా, బీజేపీ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అప్పటిదాకా చర్చ సవ్యంగానే జరుగుతుండగా, ఫోన్ లైన్ ద్వారా చెవిరెడ్డి చర్చలోకి ఎంటర్ కాగానే ఒక్కసారిగా చర్చ పక్కదారి పట్టింది. చెవిరెడ్డి చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన బొండా ఉమా... ఎర్రచందనం దుంగలను దొంగిలించే దొంగవంటూ చెవిరెడ్దిపై విరుకుచుకుపడ్డారు. దుంగలను కొట్టేసిన కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చావు కదా? అంటూ ఆయన దెప్పిపొడిచారు. ఈ సందర్భంగా బొండా ఉమా నోటి నుంచి ‘అరేయ్’ అన్న మాట వినిపించింది. ఇదే పదాన్ని ఆయన పదే పదే వాడారు. దీంతో చెవిరెడ్డి కూడా బొండాను ‘ఒరేయ్’ అంటూ సంబోధించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే తనపై ఆధారాలతో కేసు పెట్టాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో ఈ సారి పట్టుబడితే టాడా చట్టం కిందే కేసు బుక్ చేస్తామంటూ బొండా హెచ్చరించారు. పలుమార్లు చర్చ నిర్వాహకుడు చేసిన విజ్ఞప్తితో ఎట్టకేలకు శాంతించిన ఇద్దరు నేతలు తిట్ల దండకాన్ని నిలిపేశారు.

  • Loading...

More Telugu News