: నటి కేఆర్ విజయ కూతురికి వేధింపులు... రియల్ ఎస్టేట్ వ్యాపారి అరెస్ట్


పాత తరం నటి కేఆర్ విజయ కూతురును వేధింపులకు గురి చేసిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లై కొన్ని అనివార్య కారణాలతో భర్తతో వేరుగా ఉంటున్న కేఆర్ విజయ కూతురు హేమలత చెన్నై శివారులోని కేకే నగర్ లో నివాసముంటున్నారు. ఆమెకున్న ఇద్దరు కూతుళ్లు విదేశాల్లో ఉంటుండడంతో హేమలత ఒక్కరే కేకే నగర్ నివాసంలో ఉంటున్నారు. ఈ క్రమంలో పాపనాయగన్ పాళయంకు చెందిన కదిరవేల్ అనే యువకుడు తనను తాను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిచయం చేసుకుని తనను పెళ్లి చేసుకోవాలని హేమలతను వేధింపులకు గురి చేశాడు. తొలుత రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిచయం చేసుకున్న కదిరవేల్... ఓ సందర్భంలో హేమలత ఇంటికి వచ్చాడు. ఆమె ఒక్కతే ఉంటుందని తెలుసుకుని తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. దానికి ఆమె తిరస్కరించడంతో అప్పటినుంచి పలుమార్లు ఫోన్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఓ వింత కోరికను బయటపెట్టాడు. కేఆర్ విజయ కుటుంబానికి చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, మీకిష్టం లేకపోతే మీ బంధువుల్లో ఎవరినైనా చూడాలని హేమలతను కోరాడు. దీంతో షాక్ తిన్న హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కదిరవేల్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News