: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం కేసు కొత్త మలుపు...నిందితుల్లో పోలీసు అధికారి కుమారుడు!
నేటి ఉదయం సికింద్రాబాదులోని ఆల్ఫా హోటల్ వద్ద బట్టల దుకాణాల్లో మంటలు చేలరేగిన సంగతి తెలిసిందే. వేసవి ఎండల కారణంగా మంటలు చెలరేగి ఈ దుకాణాలు కాలిపోయాయని పోలీసులు భావించారు. అలా కాని పక్షంలో ఇది ఆకతాయిల పని అయివుంటుందని అనుమానించారు. అయితే, తమ దర్యాప్తులో భాగంగా ఈ పరిసరాల్లోని సీసీ కెమెరా పుటేజ్ ను పరిశీలించిన పోలీసులు షాక్ తిన్నారు. మాదాపూర్ లోని 8వ బెటాలియన్ కు చెందిన పోలీసు ఉన్నతాధికారి కుమారుడు ఈ అగ్నిప్రమాదం కేసులో నిందితుడు అని గుర్తించారు. దీంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు చిరంజీవి, నిషిత్ అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మద్యం మత్తులో స్నేహితులతో సరదా కోసం దుకాణాలకు నిప్పింటించినట్టు నిందితుడు చెప్పడం విశేషం. దీంతో బాధితులు మండిపడుతున్నారు. పోలీసు అధికారినన్న బలుపును ప్రదర్శించేందుకు పేదలే దొరికారా? అని వారు నిలదీస్తున్నారు. నిలువ నీడ లేకుండా చేసిన నిందితుడ్ని శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.