: అమెరికాలో కంటే వారం ముందుగానే ఇండియాలో విడుదలవుతున్న హాలీవుడ్ మూవీ!
భారత్ మార్కెట్ మీద హాలీవుడ్ ఫిలిం మేకర్లకు మోజు ఎక్కువైంది. హాలీవుడ్ సినిమాలు ఇక్కడ కనక వర్షం కురిపిస్తుండడమే అందుకు కారణం. దీంతో హాలీవుడ్ సినిమాలను నేరుగా భారత్ లో విడుదల చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా 'జంగిల్ బుక్' సినిమాను కూడా అలా ఆలోచించే విడుదల చేసి, కాసుల పంట పండించుకున్నారు. ఇప్పుడు ఈ తరహా ఆలోచనను 'ఎక్స్ మెన్' సిరీస్ దర్శకుడు బ్రియాన్ సింగర్ ఆచరణలో పెడుతున్నాడు. 'ఎక్స్ మెన్' సిరీస్ సినిమాలకు భారత్ లో అశేషమైన అభిమానగణం ఉంది. దీంతో ఆయన తాజాగా తీసిన 'ఎక్స్ మెన్ అపోకలిప్సో'ను నేరుగా భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. మే 20న భారత్ లో దీనిని విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపాడు. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ లో 'ఎక్స్ మెన్' అభిమానులు ఎక్కువని, అందుకే అమెరికాలో విడుదల చేయడానికి వారం రోజుల ముందే భారత్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భారతీయ సినీ ప్రేక్షకులు వినియోగించుకుంటారని భావిస్తున్నామని ఈ సినీ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియో తెలిపింది.