: పది లక్షల మంది ఐటీ ఉద్యోగులు కావాలి: నాస్కామ్
వచ్చే 9 సంవత్సరాల్లో ఇండియాకు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగుల అవసరం ఉందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ వెల్లడించింది. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడనుందని, 2025 నాటికి ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు గణనీయంగా పెరగనున్నాయని నాస్కామ్ సైబర్ సెక్యూరిటీ విభాగం టాస్క్ ఫోర్స్ సభ్యుడు రాజేంద్ర పవార్ వెల్లడించారు. ఈ విభాగంలో ఆదాయం రూ. 3,500 కోట్లకు చేరనుందని భావిస్తున్నామని, చిన్న చిన్న కంపెనీలు పెరుగుతున్న కొద్దీ ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతూ ఉంటుందని, సమీప భవిష్యత్తులో దాదాపు 1000కి పైగా ఐటీ స్టార్టప్ కంపెనీలు ప్రారంభం కానున్నాయని, ఈ కంపెనీల సైబర్ భద్రత అత్యంత కీలకమని అన్నారు. సాఫ్ట్ వేర్ లను వైరస్ బారినుంచి కాపాడే సేవలందిస్తున్న సిమాంటెక్ తో కలసి 'నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్' ప్రారంభించామని, సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికేషన్ కోర్సు చేస్తున్న మహిళలకు రూ. 1000 స్కాలర్ షిప్ ను అందిస్తున్నామని వివరించారు.