: హంద్వారాలో స్థానిక బాలికపై లైంగిక దాడి ఘటనలో నిందితుడి అరెస్ట్
జమ్మూకాశ్మీర్‌లోని హంద్వారాలో స్థానిక బాలికపై ఓ జవాను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే తనపై వేధింపులకు పాల్పడిన వారు ఆర్మీ జవాన్లు కాదని సదరు బాలిక ఇచ్చిన వాంగ్మూలంతో.. వేధింపులకు కారణమైన వారిని గాలించిన పోలీసులు హిలాల్ అహ్మద్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి జవాను తనపై లైంగిక వేధింపులకు పాల్పడలేదని, స్థానిక యువకులే తనను వేధించారని బాలిక చెప్తుండగా తీసిన వీడియోను ఇటీవలే ఆర్మీ కూడా విడుదల చేసింది. వీడియోలో జరిగిన సంఘటనను వివరిస్తూ.. సదరు బాలిక ఓ స్థానిక యువకులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, వారే తనను లైంగిక వేధింపులకు గురి చేశారని తెలిపింది. వారిని గుర్తు పట్టగలనని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేస్తోన్న పోలీసులు హిలాల్ అహ్మద్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వేధింపులకు పాల్పడిన మరో వ్యక్తిని పోలీసులు గాలిస్తున్నారు.