: కిడ్నాప్ అయిన 16 ఏళ్లకు నగదు ఇచ్చి మరీ విడిచిపెట్టారు
కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తిని 16 ఏళ్ల తర్వాత నగదు ఇచ్చి మరీ విడిచిపెట్టారు కిడ్నాపర్లు. 16ఏళ్ల క్రితమే చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి ఇప్పుడు తిరిగిరావడంతో ఆయన కుటుంబం ఆనంద బాష్పాలు రాల్చింది. త్రిపుర రాజధాని అగర్తలలో అరటి పళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న రాజన్ సాహ అనే వ్యక్తి 2000 సంవత్సరంలో కిడ్నాప్ అయ్యాడు. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర తీవ్రవాదులు రాజన్‌ను అక్కడి జంపుజాయిలా ప్రాంతంలో రాజన్‌తో సహా మరో ఇద్దరు వ్యాపారులను కిడ్నాప్ చేశారు. అనంతరం చిట్టిగాంగ్ పర్వత శ్రేణి ప్రాంతానికి తీసుకెళ్లారు. రాజన్ నుంచి డబ్బు డిమాండ్ చేశారు. డబ్బు ఇచ్చుకోలేనని చెప్పిన రాజన్‌ను చిత్రహింసలకు గురిచేశారు. అతనితో పనులు చేయించుకున్నారు. చివరికి 16 ఏళ్ల తర్వాత అతని చేతిలో కొంత డబ్బును పెట్టి మరీ ఇప్పుడు విడిచిపెట్టారు. తనతో పాటు ఆరోజు కిడ్నాప్ అయిన మరో ఇద్దరు వ్యక్తులను మరో ప్రాంతానికి తరలించారని రాజన్ చెప్పాడు. అయితే, గతంలో రాజన్‌ను విడిపించేందుకు ఆయన కుటుంబ సభ్యులు అనేక మంది ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి వారు కోర్టును ఆశ్రయించగా విచారణ జరిపిన అధికారులు.. కిడ్నాపర్ల చేతిలో రాజన్ మరణించినట్లు కోర్టుకు మరణ ధ్రువీకరణ పత్రం సైతం అందజేశారు.