: మంది సొమ్ము మజ్జిగ పాల్జేస్తున్నారు!: చంద్రబాబుపై అంబటి సెటైర్లు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై చర్చించేందుకు వైసీపీ నేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా అంబటి... చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై విమర్శలు గుప్పించారు. మంది సొమ్ము మజ్జిగ పాల్జేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం మజ్జిగ పంపిణీ పథకానికి తెర తీసిందని ఆయన ఆరోపించారు. హెరిటేజ్ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తులను అమ్ముకునేందుకే చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారని ఆయన విమర్శించారు. అన్నింటిని తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న చంద్రబాబు... చివరకు వేసవి తాపాన్ని కూడా సొంత లాభానికే వాడుకుంటున్నారని అంబటి ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వంలోని మంత్రులకు ప్రజలు ర్యాంకులివ్వాలి గాని, వారికి వారే ఎలా ఇచ్చుకుంటారని ప్రశ్నించారు. ర్యాంకుల్లో మంత్రి నారాయణ చివరి స్థానంలో నిలవగా... నారాయణ ప్రారంభించిన నారాయణ విద్యా సంస్థలు మాత్రం ఇంటర్ ఫలితాల్లో అందరి కంటే ముందున్నాయన్నారు. నారాయణ విద్యా సంస్థల విజయంపై టీవీ చానెళ్లలో భారీ ప్రచారం జరుగుతోందని కూడా అంబటి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.