: అత్యాచార బాధితురాలిపై ఫిలిప్పీన్స్ మేయర్ క్రూర వ్యాఖ్య... వెల్లువెత్తిన విమర్శలు!


ఇంతకన్నా క్రూరమైన వ్యాఖ్యలు ఇంకెవరూ చెయ్యలేదేమో! ఓ బాధ్యత గల పదవిలో ఉండి, దేశాధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న వ్యక్తి ఇంత బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవడం గతంలో జరగలేదేమో. బహుశా నిత్యమూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ ఈయన ముందు దిగదుడుపే... ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఫిలిప్పీన్స్ లోని దావావో నగరం మేయర్ రోడ్రిగో డుటిర్టీ. తదుపరి ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవికి కూడా పోటీ పడుతున్నాడు. గతంలో జరిగిన ఆస్ట్రేలియన్ యువతి జాక్వలిన్ హమిల్ నిర్బంధం, అత్యాచారంపై రోడ్రిగో స్పందించారు. "ఆమెపై అత్యాచారం జరిగినందుకు నాకు కోపంగా ఉంది. ఇదో విషయం. అయితే, ఆమె చాలా అందంగా ఉంది. నగరానికి తొలి పౌరుడినైన నేను ముందు ఉండాల్సింది. వేస్ట్ అయిపోయింది" అంటూ వీడియో కెమెరా ముందు మాట్లాడారు. ఇంకేముంది, ఆ వీడియో యూట్యూబ్ లో వైరల్ కాగా, సాధారణ ప్రజల నుంచి విపక్షాలు, మహిళా సంఘాలు విరుచుకుపడుతున్నాయి. క్విజోన్ నగరంలో జరిగిన ప్రచార ర్యాలీలో ఈ మాటలను ఆయన చెప్పినట్టు సీఎన్ఎన్ ప్రకటించింది. రోడ్రిగో నగరానికి తొలిసారిగా మేయర్ అయిన 1989 ప్రాంతంలో, దావావో సిటీ జైలులో జరిగిన హింసాకాండ అనంతరం ఖైదీలు హమిల్ సహా 15 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆమెపై అత్యాచారం చేశారు. సైన్యం జైల్లోకి దూసుకొస్తున్న సమయంలో ఆమెను గొంతు కోసి చంపారు. ఈ ఘటననే ప్రస్తావిస్తూ, "ఆమె ముఖంలోకి నేను చూశాను. అందమైన అమెరికన్ హీరోయిన్ లా కనిపించింది. నేనూ ఉండాల్సింది. వృథా అయిపోయింది" అని రోడ్రిగో చెప్పారు. ఆయన మాటలను ఆస్ట్రేలియన్ ఎంబసీ సైతం ఖండించింది. అత్యాచారాలు, హత్యలపై జోకులేంటని ప్రశ్నిస్తూ, మహిళలు, బాలికలపై ఎటువంటి హింసనూ ఎక్కడైనా, ఎప్పుడైనా వ్యతిరేకించాల్సిందేనని అభిప్రాయపడింది. ఇటువంటి వ్యక్తులకు అధికారం ఇవ్వరాదని రోడ్రిగో ప్రధాన పోటీదారుగా ఉన్న రోక్సాస్ ప్రజలను కోరారు.

  • Loading...

More Telugu News