: జనంలోకి జగన్!... వైఎస్ పాదయాత్ర తరహాలో భారీ యాత్రకు సన్నాహాలు!
ఎన్నికల్లో ఓటమితో అధికారం అందకుండానే పోయింది. అండగా నిలబడతారనుకున్న పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా చేజారుతున్నారు. వెరసి క్రమంగా బలం తగ్గుతోంది. ఇదీ, ప్రస్తుతం ఏపీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో మొదలైన జంపింగ్ పర్వం నాన్ స్టాప్ గా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో జనంలోకి వెళ్లేందుకే జగన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఓదార్పు యాత్ర, పరామర్శ యాత్రల పేరిట తెలుగు నేలను చుట్టేసిన జగన్... తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దీక్షలు చేపట్టారు. వీటికి భిన్నంగా ఏపీ వ్యాప్తంగా ఓ భారీ పాదయాత్రకు ఇప్పుడు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. గతంలో జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తర్వాత గడచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత, ఏపీ సీఎం కూడా భారీ పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్ర చంద్రబాబుకు తిరిగి అధికారం కట్టబెట్టడంలో పూర్తిగా కాకున్నా కొంతమేర పనిచేసిందనే చెప్పాలి. ఆ తరహాలోనే జగన్ కూడా భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఈ యాత్రతో అటు ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తూనే, ఇటు తన పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలను నిలువరించవచ్చన్న యోచనలో జగన్ భారీ కసరత్తే చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ యాత్రకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.