: కలిసి పనిచేయకపోతే కష్టమే!.... రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలకు క్లాస్ పీకిన చంద్రబాబు


విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో సత్తా చాటాలంటే పార్టీ నేతలు విభేదాలు వీడాల్సిందేనని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆ జిల్లా నేతలకు సూచించారు. ఇటీవలే పార్టీలో చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జీ రామసుబ్బారెడ్డిల మధ్య చాలాకాలంగా విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ రామసుబ్బారెడ్డి తన శాయశక్తుల యత్నించారు. అయితే పార్టీ పురోభివృద్ధి పేరు చెప్పి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. అయినా వారిద్దరి మధ్య విభేదాలు సమసిపోలేదు. ఈ క్రమంలో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలతో పాటు పార్టీ జిల్లా నేతలు, జిల్లా ఇన్ చార్జీ మంత్రి గంటా శ్రీనివాసరావులను బెజవాడ పిలిపించుకున్న చంద్రబాబు నిన్న సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలను పక్కపక్కనే కూర్చోబెట్టిన చంద్రబాబు... వారిద్దరి మధ్య విభేదాలతో పార్టీకి జరిగే నష్టాన్ని వివరించారు. అదే సమయంలో కలిసి పనిచేస్తే లాభించే అంశాలను కూడా చంద్రబాబు వారి ముందు పెట్టారు. విపక్ష నేత జగన్ ను గట్టిగా ఢీకొట్టాలంటే విభేదాలను పక్కనపెట్టాల్సిందేనని ఆయన వారికి సూచించారు. ఈ క్రమంలో కలిసి పనిచేస్తామని వారిద్దరూ చంద్రబాబుకు హామీ ఇచ్చి బయటకు వచ్చారు.

  • Loading...

More Telugu News