: మరో 8 మందికి ఝలక్కిచ్చిన జయ!... స్థానం మార్చిన కెప్టెన్!
తమిళనాట ఎన్నికల సిత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే టికెట్లు ఇచ్చినట్లే ఇచ్చి 18 మందికి మొండి చేయి చూపిన అన్నాడీఎంకే అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత నిన్న మరో 8 మందికి షాకిచ్చారు. అరక్కోణం, తిరుచ్చి తూర్పు, శంకరాపురం, ఈరోడ్ పశ్చిమం, శ్రీవైకుంఠం, కోయిల్ పట్టి, పాలయం, కోట సీట్లకు గతంలో కేటాయించిన అభ్యర్థులను తొలగించిన జయలలిత... ఆ స్థానాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించారు. ఇక అటు అధికార పార్టీకే కాక ఇటు విపక్షం డీఎంకేకు కూడా కొరకరాని కొయ్యగా మారిన డీఎండీకే అధినేత ‘కెప్టెన్’ విజయకాంత్ తాను పోటీ చేస్తున్న సీటును ఆకస్మికంగా మార్చేశారు. గడచిన ఎన్నికల్లో విల్లుపురం జిల్లా రిషివందియం అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన ఆయన ఈ దఫా కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, నిన్న ఉన్నట్టుండి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రిషివందియం నుంచి కాకుండా విల్లుపురం జిల్లాకే చెందిన ఉళుందూర్ పేట నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. సీటు మార్పునకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.