: ఇప్పుడు కాదులే!... తర్వాత చూద్దాం!: లోకేశ్ కు మంత్రి పదవిపై చంద్రబాబు కామెంట్
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... తన కొడుకు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కేబినెట్ లో మంత్రి పదవిపై నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పుడు కాదు... తర్వాత చూద్దాం’’ అంటూ ఆయన కామెంట్ చేశారు. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న లోకేశ్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపించాయి. లోకేశ్ కోసం పదవి త్యాగం చేస్తామని పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగ ప్రకటనలు చేశారు. త్వరలోనే లోకేశ్ కు మంత్రివర్గంలోకి ఎంట్రీ లభిస్తుందని అంతా భావించారు. ఈ క్రమంలో నిన్న జరిగిన కేబినెట్ భేటీ తర్వాత విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు ఈ విషయంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఈ విషయంపై ఆలోచిద్దామన్న చంద్రబాబు... మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్న ప్రశ్నకు ముసిముసిగా నవ్వుతూ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. అంటే... మంత్రివర్గ విస్తరణ దాకా లోకేశ్ వేచి చూడక తప్పదన్న మాట.