: 23 నుంచి భేతాళుడి ఉత్సవాలు ప్రారంభం
భేతాళకథలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ‘చందమామ’. ఎందుకంటే, అందులో భేతాళ కథలు శీర్షికగా ప్రచురితమవడం, పిల్లలూ పెద్దలూ ఆసక్తిగా చదవడం అందరికీ తెలిసిందే. పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని వెళ్లడం, ఆ శవాన్ని ఆవహించి ఉన్న భేతాళుడు ప్రశ్నలు వేయడం ఆయా కథలలో చదువుకున్నాము. కట్ చేస్తే... మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఈ నెల 23 నుంచి భేతాళుడి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా జాతరకు ప్రజలు అధిక సంఖ్యలోనే తరలివస్తారు. మే 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలు.. * 23వ తేదీన పోలేరమ్మ దేవతకు బోనాలు * 24న పోచమ్మ దేవతకు బోనాలు * 25న దుర్గమ్మ దేవతకు బోనాలు * 26న భేతాళస్వామికి బోనాలు * 27న భేతాళ స్వామి ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లు తిప్పడం * 28న భజనలు * 29న భాగవత ప్రవచనాలు * 30న వినోద కార్యక్రమాలతో పాటు మే 1వ తేదీన భేతాళస్వామికి జరిగే ఒక కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. కాగా, ఈ ఉత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఆలయం ఏర్పాటు వెనుక కథ... కొన్నేళ్ల క్రితం ఈ గ్రామంలో అధికంగా వ్యాధులు ప్రబలుతుండేవి. దీంతో భయపడిపోయిన ప్రజలు భేతాళుడి విగ్రహం ఏర్పాటు చేస్తే ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చనే నమ్మారు. అంతేకాకుండా, భేతాళ స్వామికి పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరతాయని ప్రజలు నమ్ముతారు. జంతు బలులు ఇచ్చి తమ ఇష్టదైవానికి మొక్కులు తీర్చుకుంటూ ఉండటం ఎన్నోఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.