: వేసవిని ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం!: చంద్రబాబు


ఎండలు మండిపోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఎండల ధాటికి తాళలేక వడదెబ్బకు గురై పలువురు మరణిస్తున్నారని అన్నారు. వేసవి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 563 గ్రామాలకు వివిధ రూపాల్లో తాగునీటి సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ఏడాది తీసుకున్న చర్యలవల్ల భూగర్భజలాలు పెరిగాయని ఆయన వెల్లడించారు. గత ఏడాది కంటే తీవ్రమైన ఎండలు ఉన్నాయని పేర్కొన్న ఆయన, పట్టణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తాగు నీటి సమస్య లేకుండా చేస్తామని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 15 కోట్లు విడుదల చేశామని ఆయన చెప్పారు. 8,50,000 ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకు 13 లక్షల మంది ప్రస్తుతం శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సంఖ్య 25 లక్షలకు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. వీరు పని చేసేటప్పుడు వారికి మంచినీరు, మజ్జిగ అందించేందుకు ఒక మనిషిని నియమించామని ఆయన తెలిపారు. మరుగుదొడ్లు కట్టుకోవాలనే వారికి ప్రభుత్వం తరపున కట్టిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి పని కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇలా వేసవిని, కరవును ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. పశుగ్రాసానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. రైతులకు మెరుగైన విధానాలు అందుబాటులోకి తీసుకొచ్చి వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. గ్రామంలో ఎంత మంది రైతులు ఉన్నారు. వారి ఆర్థిక స్థాయి లేంటి, వారిలో ఎవరి దగ్గర పశువులు ఉన్నాయి? ఇలా డేటా సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ డేటా సేకరణ వల్ల భవిష్యత్ లో కరవును ఎదుర్కోవడంతో పాటు, రైతును ఆదుకునే వెసులుబాటు ఉంటుందని ఆయన చెప్పారు. పగలు 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరూ బయటకి రావద్దని ఆయన సూచించారు. మరీ అత్యవసరమైతే తగిన రక్షణ చర్యలు తీసుకుని బయటకు రావాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మొత్తం 7,232 చలివేంద్రాలు పెట్టామని ఆయన చెప్పారు. 6 లక్షలకు పైగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేశామని ఆయన తెలిపారు. ప్రతి జిల్లాకు 3 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ నిధులను కలెక్టర్ పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ఈ మూడు కోట్ల రూపాయలతో ఎక్కడ అవసరమో అక్కడ చలివేంద్రాలు పెట్టడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు, భారీ ఎత్తున మజ్జిగ అందజేసేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇక్కడ డబ్బుకంటే ప్రజాశ్రేయస్సు ముఖ్యమని ఆయన చెప్పారు. వీటి తనిఖీకి జిల్లా మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ నేత ముగ్గుర్నీ పంపుతామని ఆయన తెలిపారు. ప్రజలను ఆదుకునే బాధ్యత పార్టీ, ప్రభుత్వం తీసుకుంటాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేయనున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News