: కోహినూర్ చోరీ కాలేదు... దానిని వెనక్కు తీసుకురాలేం: సుప్రీంకు తేల్చిచెప్పిన కేంద్రం
కోహినూర్ వజ్రాన్ని వెనక్కు తీసుకొచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. అంతేకాకుండా సదరు విలువైన వజ్రం చోరీకి గురి కాలేదని కూడా తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కొద్దిసేపటి క్రితం జరిగిన విచారణ సందర్భంగా... కోహినూర్ వజ్రాన్ని వెనక్కు తీసుకురాలేమని ప్రకటించింది. కోహినూర్ వజ్రాన్ని నాటి రాజులు ఈస్టిండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని ప్రభుత్వం సుప్రీం ధర్మాసనానికి తెలిపింది. బ్రిటన్ రాణి కిరీటంలోని కోహినూర్ వజ్రం భారత్ కు చెందినదని, దానిని తిరిగి తీసుకొచ్చేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలన్న ఓ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం అసలు విషయాన్ని కోర్టుకు తెలిపింది.