: ఎన్నికల పుణ్యం... తమిళనాట రోజుకు రూ. 1200 సంపాదిస్తున్న విద్యార్థులు!
కాలేజీలు, స్కూళ్లు వేసవి సెలవుల కారణంగా మూతపడ్డాయి. ఇక విద్యార్థులు చేసే పని సెలవులను ఆనందించడం లేకుంటే, తదుపరి సంవత్సరం చదివే తరగతికి సంబంధించిన పుస్తకాలు తిరగేయడం. కానీ ఎన్నికలు జరుగుతున్న తమిళనాట, విద్యార్థులు ఆ పని చేయడం లేదు. వివిధ పార్టీల ర్యాలీల్లో పాల్గొంటూ చేతినిండా డబ్బు సంపాదిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న తమిళనాడులో, ఒక్కో పార్టీ ర్యాలీ నిర్వహిస్తే, అందుకోసం కనీసం 20 వేల మందిని నేతలు సమీకరించాల్సి వుంటుంది. ఇక ర్యాలీలో పాల్గొనే విద్యార్థులకు డిమాండ్ పెరిగిపోయింది. ఒక రోజు తమ వెంట ఉండి ర్యాలీ, సభలకు హాజరై జేజేలు కొట్టిన వారికి పార్టీలు రూ. 1200 వరకూ ఇస్తుండటంతో, విద్యార్థులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఈ విషయం పడకుండా ఉండేందుకు తమిళనాడు నేతలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. తమ ప్రచార ర్యాలీల నిర్వహణలను ఈవెంట్ మేనేజర్లకు అప్పగిస్తున్నారు. ఇక వారు వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి విద్యార్థులను సంప్రదించి, వారిని ర్యాలీలకు పంపుతున్నారు. పురుషులు, మహిళలతో పోలిస్తే, విద్యార్థులకే అధికంగా దక్కుతోంది. పురుషులకు రూ. 600, మహిళలకు రూ. 800 ఇస్తున్న పార్టీలు, విద్యార్థులు వస్తామంటే పెద్దపీట వేస్తున్నాయని లోక్ సత్తా ప్రతినిధి డి.జగదీశ్వరన్ వ్యాఖ్యానించారు. చెన్నై పరిసరాల్లో అయితే, 10 వేల మంది వరకూ, ఇతర ప్రాంతాలైతే 5 వేల మంది వరకూ విద్యార్థులను ఈవెంట్ మేనేజర్లు సరఫరా చేస్తున్నారని, కొన్ని చోట్ల విద్యార్థులు ఒకే రోజు రెండు ర్యాలీల్లో పాల్గొని రూ. 2 వేలకు పైగా తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఏదిఏమైనా, ఈ వేసవి ఎన్నికలు ఒక్కో విద్యార్థికీ 30 నుంచి 40 వేల సంపాదన సమకూరుస్తాయని అంచనా.