: మాట నిలబెట్టుకోని పెళ్లి కొడుకు వద్దే వద్దు.. పెళ్లిపీటల మీదే పెళ్లి నిరాకరించిన యువతి
పెళ్లికి ముందే మాటిచ్చి ఆ మాటపై నిలబడని పెళ్లి కొడుకును ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ యువతి తిరస్కరించింది. దీంతో ఆ యువతికి మరో వరుడితో పెళ్లి చేశారు. అక్కడి ఓ ఛారిటీ ఆర్గనైజేషన్ నిర్వహించిన సామూహిక వివాహాల్లో ఈ దృశ్యం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'స్వచ్ఛ భారత్' నుంచి ప్రేరణ పొందిన ఓ యువతి ఇలా చేయడం అక్కడి వారందకీ ఆశ్చర్యం కలిగించడంతో పాటు వారిలో స్ఫూర్తిని నింపింది. నేహా అనే యువతికి పెళ్లికి ముందే ఇంట్లో మరుగుదొడ్డి కట్టిస్తానని సదరు వరుడు మాటిచ్చాడు. అనంతరం తన మాటను నిలబెట్టుకోకుండానే సామూహిక వివాహాల్లో పెళ్లి కొడుకు గెటప్‌తో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో పెళ్లిపీటల మీదే ఆ వరుడ్ని తిరస్కరించింది, ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లికి ఒప్పుకోనని తెగేసి చెప్పింది. అంతేకాదు, సామూహిక వివాహాల్లో భాగంగా అక్కడే ఉన్న మరో వరుడిని నేహా పెళ్లి చేసుకుని ఫినిషింగ్ టచ్ ఇచ్చింది.