: భాగ్యనగరిలో భారీ అగ్ని ప్రమాదం... పేకమేడలా కుప్పకూలిన ఐదంతస్తుల ప్లాస్టిక్ గోదాం
భాగ్యనగరి హైదరాబాదులో నిన్న భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని సీతారాంబాగ్ లో చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో ఓ ఐదంతస్తుల భవంతి పేకమేడలా కుప్పకూలింది. ప్లాస్టిక్ వస్తువుల గోదాముగా వినియోగిస్తున్న ఈ భవంతిలో ప్రమాదం జరిగే సమయంలో ఏ ఒక్కరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఈ భవంతిలో మంటలు చెలరేగగా, వాటిని ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. అయితే మంటలు అదుపులోకి రాకపోగా, భవంతి పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి దగ్గరుండి మరీ సహాయక చర్యలను పర్యవేక్షించారు.