: ఎన్నో పూజలు చేస్తే కానీ ఈ పరిశ్రమకు రాలేము: సినీనటి జయచిత్ర
ఎన్నో పూజలు చేస్తే కానీ సినీ పరిశ్రమకు రాలేమని సీనియర్ నటి జయచిత్ర తెలిపారు. ఓ టీవీ చానెల్ తో ఆమె మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో ఉంటే పేరుప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు ఇలా ప్రతిదీ వస్తుందని అన్నారు. ఇతర పరిశ్రమల్లో అయితే ఎవరి పని వారు చేసుకుంటారని, సినీ పరిశ్రమలో అలా కాదని ఆమె చెప్పారు. సినీ నటులు చేయాల్సిన పనిని దర్శకుడే సగం చేస్తాడని ఆమె చెప్పారు. మిగిలిన సగం చక్కగా చేయగలిగితే సరిపోతుందని ఆమె అన్నారు. ఆ మాత్రం చేస్తే చాలు, అభినందనలు వెల్లువెత్తుతాయని ఆమె చెప్పారు. అంతకంటే బాగా నటించగలిగితే అది ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుందని ఆమె అన్నారు. ఓ సినిమా ఫంక్షన్ లో కలిసినప్పుడు, 'మీతో డ్యాన్సు చేయాలని ఉంది, మీరు సన్నబడండి, మనం ఓ సినిమా చేద్దాం' అని ఆమధ్య చిరంజీవి చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో సన్నబడిపోదామని అనుకున్నాను కానీ అందుకు ప్రయత్నించలేదని ఆమె తెలిపారు.