: ఆసుపత్రిపై మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసిన ప్రత్యూష బెనర్జీ తల్లిదండ్రులు
హిందీ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య నిందితుడు రాహుల్ రాజ్ సింగ్ ను ముంబైలోని శ్రీసాయి హాస్పిటల్ యాజమాన్యం కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆమె తల్లిదండ్రులు మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. ఈ కేసు నుంచి రాహుల్ రాజ్ ను కాపాడేందుకు ఆసుపత్రి యాజమాన్యం డబ్బులు కూడా తీసుకుందని మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు మెయిల్ లో పేర్కొన్నారు. దీనిపై ఆసుపత్రి వైద్యులు డాక్టర్ గోయల్ మాట్లాడుతూ, తాము రాహుల్ కు సహాయం చేయడం లేదని అన్నారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న రాహుల్ ను తమ ఆసుపత్రిలో చేర్చుకుని సైకియాట్రిస్ట్ తో పాటు మరో ఇద్దరు డాక్టర్లు అతనికి పరీక్షలు నిర్వహించారని అన్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై రోజు విడిచి రోజు పోలీసులకు నివేదిక ఇచ్చామని ఆయన తెలిపారు. కుమార్తెను కోల్పోయిన వారిపై సానుభూతి ఉందికానీ, ఆసుపత్రిపై ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు.