: హైదరాబాదులో వడగళ్ల వాన...నగరవాసులకు ఉపశమనం
హైదరాబాదులోని శివారు ప్రాంతాలైన సైదాబాద్, చంపాపేట్, మల్లాపూర్, అంబర్ పేట్, ఉప్పల్, బోడుప్పల్, ఈసీఐఎల్, కాప్రాలలో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వాన కురువగా, మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఇంకొన్ని చోట్ల భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కురిసింది. దీంతో గత మూడు రోజులుగా సూర్యుడి భగభగలతో ఉడికిపోయిన హైదరాబాదుకు ఉపశమనం లభించింది. అయితే ఇంత పెద్ద వర్షం పడ్డప్పటికీ వేడి పెనంపై పడిన నూనెలా నీరు భూమిలోకి ఇంకిపోయింది. ఒక్కసారిగా మబ్బుపట్టి ఉరుములు, మెరుపులతో పిలవని పేరంటంలా వచ్చిన వర్షాన్ని చూసిన నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు.