: నా వెనుక జగన్ లేరు... పవన్ కల్యాణ్ ను అడగలేదు: ముద్రగడ
కాపులను బీసీల్లో చేర్చాలని తాను చేస్తున్న ఉద్యమం వెనుక వైకాపా అధినేత వైఎస్ జగన్ హస్తం ఉందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. అనంతపురం పర్యటనలో భాగంగా, కాపు సంఘాల నేతలతో సమావేశమైన ఆయన, కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఉద్యమానికి మద్దతివ్వాలని తాము పవన్ కల్యాణ్ ను కోరనేలేదని స్పష్టం చేశారు. తాను సలహాలు తీసుకునేంత స్థాయి జగన్ కు లేదని వ్యాఖ్యానించిన ముద్రగడ, జూన్ తరువాత ఉద్యమంలో మలిదశ ప్రారంభమవుతుందని అన్నారు. తుని ఘటనలో కాపులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. బ్రిటీష్ హయాంలోనే కాపులను బీసీల్లో చేర్చాలని చెబితే, ఇప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. తమ జాతివల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, అధికారం పొందిన టీడీపీ, ఇప్పుడు కాపులను పాక్ జాతీయుల మాదిరిగా చూస్తోందని ఆరోపించారు. తక్షణం కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.