: నేనేమీ బీజేపీని దేబిరించలేదు: ప్రియాంకా గాంధీ
తన ఇంటి అద్దెను తగ్గించాలని 2002లో బీజేపీ ప్రభుత్వంతో బేరమాడినట్టు వచ్చిన వార్తలపై సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ స్పందించారు. తానేమీ అద్దె తగ్గింపు కోసం వాజ్ పేయి సర్కారును దేబిరించలేదని అమె అన్నారు. ఆ ప్రాంతంలోని ప్రభుత్వ అధికారులు చెల్లిస్తున్న విధంగానే తాను కూడా అద్దె చెల్లిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. తాను ఓ ప్రైవేటు నివాసంలో ఉన్న వేళ, భద్రతా కారణాలను చూపుతూ, కేంద్ర ప్రభుత్వమే తనను ప్రభుత్వ నివాసానికి మారాలని సూచించిందని ప్రియాంక ఓ ప్రకటనలో తెలిపారు. మార్కెట్ రేటు, అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగానే తనకు భవనాన్ని కేటాయించారని, దీనికి ప్రత్యేక లైసెన్స్ ఫీజును కూడా తాను చెల్లించానని వెల్లడించారు. కాగా, ఢిల్లీలోని లుటియెన్స్ ప్రాంతంలోని ఓ భవంతికి రూ. 53,421గా అద్దెను నిర్ణయించగా, అంత చెల్లించలేనని, అద్దెను రూ. 8,888కి తగ్గించాలని ప్రియాంక లేఖ రాసి బేరమాడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.