: తాజ్ మహల్ వద్ద నాడు తల్లి డయానా కూర్చున్న చోట నేడు ప్రిన్స్ విలియమ్!
1992లో తన ఒంటరి పర్యటన సందర్భంగా ఇండియాకు వచ్చిన దివంగత ప్రిన్సెస్ డయానా తాజ్ మహల్ ముందు ఎక్కడైతే కూర్చుని ఫోటోలు తీయించుకున్నారో, అదే బెంచ్ పై ఆమె కుమారుడు ప్రిన్స్ విలియమ్ దంపతులు కూర్చున్నారు. వారం రోజుల భారత్ - భూటాన్ పర్యటన ముంగింపునాడు విలియమ్, కేట్ దంపతులు తాజ్ మహల్ ను సందర్శించారు. ఈ పర్యటన తమకు మరపురాని అనుభూతిని మిగిల్చిందని, తన తల్లి కూర్చున్న చోటనే తాను కూర్చోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఈ సందర్భంగా విలియమ్ వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ తన తల్లిని గురించి ఏదో ఒక సమయంలో ఆలోచన వస్తుంటుందని అన్నారు. ఎండ వేడిమి అధికంగా ఉన్నప్పటికీ, బ్లూ కలర్ బ్లేజర్ వేసుకుని వచ్చిన విలియమ్, వైట్ కలర్ స్లిమ్ లైన్ డ్రస్ తో వచ్చిన కేట్, తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో కాసేపు విహరించారు. తమ పర్యటనలో భాగంగా కజిరంగా పార్క్ సహా ఇండియాలోని పలు ప్రాంతాల్లో విలియమ్ దంపతులు పర్యటించిన సంగతి తెలిసిందే.