: మాల్యాకు మరిన్ని కష్టాలు... రేపు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ!
యూబీ గ్రూప్ మాజీ చైర్మన్, బ్యాంకులకు బకాయిలను చెల్లించలేక విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యా మరిన్ని కష్టాల్లో చిక్కుకోనున్నారు. ఆయనపై రేపు ముంబై ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన పాస్ పోర్టును 4 వారాల పాటు సస్పెండ్ చేయగా, ఇక వారంట్ కూడా జారీ అయితే, ఆ కాగితాలను బ్రిటన్ పంపాలన్నది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. మాల్యా ఎక్కడున్నాడన్న విషయం తెలియకపోయినా, పాస్ పోర్టు సస్పెండ్ తో ఆయన మరే విమానమూ ఎక్కే అవకాశం ఉండదు. ఒకవేళ అందరూ ఊహిస్తున్నట్టు ఆయన బ్రిటన్ కు పారిపోయి ఉంటే, ఆ వివరాలు బ్రిటన్ లో ల్యాండయిన వేళ నమోదవుతాయి. ఆపై పాస్ పోర్టుపై స్టాంప్ పడుతుంది. తిరిగి బ్రిటన్ నుంచి బయలుదేరాడా? లేదా? అన్నది కూడా తెలిసిపోతుంది. ఈడీ అధికారులకు ఈ విషయమే కావాలి. బ్రిటన్ వద్ద ఉండే వివరాల్లో మాల్యా ల్యాండయి, తిరిగి వెళ్లలేదని తేలితే అక్కడే ఉన్నట్టు లెక్క. ఆపై ఆయన్ను డిపోర్ట్ చేయాలని ఈడీ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరే అవకాశాలు ఉంటాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీని నిర్వహిస్తున్న వేళ, ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ. 950 కోట్లు తీసుకుని వాటి నుంచి రూ. 430 కోట్ల విలువైన ఆస్తులను విదేశాల్లో కొన్నారని ఈడీ ఆధారాలతో సహా ముంబై ప్రత్యేక కోర్టులో కేసు వేయడంతో, ఎన్బీడబ్ల్యూ జారీ చేసే విషయమై తీర్పును సోమవారం వరకూ రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.