: సినీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల దాడి
ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్లు దాడి చేశారు. హైదరాబాదులోని పూరి జగన్నాథ్ ఇంటిపైన, ఆఫీసుపైనా డిస్ట్రిబ్యూటర్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఇటీవల పూరీ తీసిన 'లోఫర్' సినిమాతో తాము నష్టపోయాం కనుక, తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ పూరీ జగన్నాథ్ తో డిస్ట్రిబ్యూటర్లు గొడవకు దిగారు. పూరీ రాబోయే సినిమాను ఆడనివ్వబోమంటూ వారు హెచ్చరించారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు ముత్యాల రాందాస్, అభిషేక్, సుధీర్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పూరీ జగన్నాథ్ ఫిర్యాదు చేశారు. సుధీర్ తనను వేధిస్తున్నాడని, లోఫర్ సినిమా నష్టాలను తిరిగి చెల్లించాలంటూ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 323, 506, 384 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మెగా కుటుంబం హీరో వరుణ్ తేజ్ తో లోఫర్ సినిమాను పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.