: హీరో నితిన్ లా పొడగరి కావాలనుకున్నా.. ఎత్తు పెరగడం కోసం ఎవరూ ఈ ఆపరేషన్ చేయించుకోవద్దు: నిఖిల్ రెడ్డి


హీరో నితిన్ లా పొడగరి కావాలనుకున్నానని, ఎత్తు పెరగడం కోసమని చెప్పి ఎవరూ ఇలాంటి ఆపరేషన్ చేయించుకోవద్దని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి(22) సూచించాడు. నిఖిల్ రెడ్డి తన ఎత్తు పెంచుకునేందుకుగాను హైదరాబాద్ లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సైడ్ ఎఫెక్ట్స్ తో నరకయాతన అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆపరేషన్ సంగతి తల్లిదండ్రులకు చెప్పకుండా పెద్ద తప్పుచేశానన్నాడు. పొట్టిగా ఉన్నానని స్నేహితులు తనను ఆటపట్టించడంతో తన కాళ్లకు ఆపరేషన్ చేయించుకున్నానని నిఖిల్ పేర్కొన్నాడు. సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో పొడుగు అవ్వాలన్న కసి పెరగడంతోనే ఈ పని చేశానని, కృత్రిమంగా పొడవు కావాలనుకోవడం తప్పిదమేనంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన నిఖిల్ రెడ్డి హైటెక్ సిటీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News