: విజయ్ మాల్యాకు శిక్ష తప్పదు, వేచి చూడండి: బీజేపీ
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు చెక్కేసిన కేసులో ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు శిక్ష తప్పదని బీజేపీ అంటోంది. మాల్యా ఉదంతంపై ఎన్డీయే సరైన దిశలోనే వెళ్తోందని కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. ఆర్థిక నేరాలను విచారించే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికి మూడుసార్లు మాల్యాకు నోటీసులు పంపింది. తన ఎదుట విచారణకు హాజరవ్వాలని ఆదేశించినా వాటిని మాల్యా పెడచెవిన పెట్టారు. దీంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విజయ్ మాల్యా పాస్ పోర్టును రద్దు చేసిన సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పేదప్రజల ధనాన్ని కాజేసిన విజయ్ మాల్యా న్యాయ విచారణ ఎదుర్కోవాల్సిందేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇటువంటి వ్యక్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించదని పేర్కొన్నారు. చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని, ప్రభుత్వం తీసుకునే చర్యలను వేచి చూడాలని వ్యాఖ్యానించారు.