: ‘జోన్’ కోసం కొనసాగుతున్న అమర్ నాథ్ ఆందోళన... నడిరోడ్డుపైనే స్నానం చేసిన వైసీపీ నేత
విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చేపట్టిన నిరాహార దీక్ష నేటికి మూడో రోజుకు చేరుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై కేంద్రం పెద్దగా స్పందించిన దాఖలా లేదు. దీంతో ప్రత్యేక రైల్వే జోన్ కోసం మొన్న అమర్ నాథ్ విశాఖలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా నేటి ఉదయం అమర్ నాథ్ తో పాటు ఆయనతో కలిసి దీక్ష చేస్తున్న నేతలంతా నడిరోడ్డుపైనే స్నానం చేసి వినూత్న నిరసనకు దిగారు. ఇదిలా ఉండగా, అమర్ నాథ్ చేస్తున్న దీక్షకు పలు వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది.