: మద్రాస్ ఐఐటీ విద్యార్థుల ‘పేరడీ అరేంజ్డ్ మ్యారేజీ’... సోషల్ మీడియాలో వీడియో వైరల్
పెద్దలు కుదిర్చిన పెళ్లిని మనం ‘అరేంజ్డ్ మ్యారేజీ’గా పిలుచుకుంటున్నాం. ఈ అరేంజ్డ్ మ్యారేజీల్లో... అబ్బాయి కోరుకునే గుణగణాలతో అమ్మాయి, అమ్మాయి ఇష్టపడే లక్షణాలతో అబ్బాయి దొరకడం కుదరదు. కొన్ని సందర్భాల్లో కుదిరినా, అన్ని సందర్భాల్లోను మాత్రం దుర్లభమే. ఇక పెళ్లి చూపుల సందర్భంగా అమ్మాయి, అబ్బాయి తరఫు బంధువుల మధ్య జరిగే సంప్రదింపులు ఓ పెద్ద తతంగమే. ఈ అరేంజ్డ్ మ్యారేజీకి సంబంధించి మద్రాస్ ఐఐటీకి చెందిన ఓ ముగ్గురు విద్యార్థులు ‘పేరడీ అరేంజ్డ్ మ్యారేజీ’ పేరిట ఓ వీడియోను రూపొందించారు. ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో కుర్చీపై కూర్చున్న ఓ మహిళ తన కుమారుడికి కావాల్సిన వధువు కోసం పెద్ద చిట్టానే విప్పింది. అంతేకాక తమ కుటుంబానికి చెందిన వివరాలను ఆసువుగా వెల్లడించింది. తొలుత యూట్యూబ్ లో చేరిన ఈ వీడియో... ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.