: కొత్తవారి చేరికతో పాత వారికి ఇబ్బందులు ఉండవు: పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు హామీ
ఏపీలో అధికార టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో జిల్లా, మండల, గ్రామస్థాయికి చెందిన వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలో కొత్తవారి చేరికతో ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగుతున్న తమ పరిస్థితి ఏమిటన్న భయం పాత కాపులను పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం విజయవాడ నుంచి పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వారికి భరోసా ఇచ్చారు. కొత్త వారి చేరికతో పాత వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన చెప్పారు. దీంతో పాతవారికి ఎలాంటి ఇబ్బంది కలగనివ్వబోమని చంద్రబాబు చెప్పారు. పాత వారికి ప్రాధాన్యం కల్పించిన తర్వాతే కొత్త వారికి అవకాశం కల్పిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.