: 'బ్రాండెక్స్' కంపెనీలో రణరంగం... సంస్థ ప్రతినిధులపై చెప్పులు విసిరిన మహిళా కార్మికులు
బహుళ జాతి కంపెనీ బ్రాండెక్స్ ఏపీ యూనిట్ లో నిన్న మధ్యాహ్నం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ఏర్పాటైన బ్రాండెక్స్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులు వేతనాల పెంపు, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిన్న మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కంపెనీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన కార్మికులను కంపెనీ ప్రతినిధులు అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన మహిళా కార్మికులు కంపెనీ ప్రతినిధులపై చెప్పులు, రాళ్లతో దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. అయినప్పటికీ, తమ డిమాండ్లు సాధించుకునే దాకా ఆందోళన విరమించరాదని కార్మికులు నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ, సీపీఎం పార్టీల స్థానిక నేతలు కార్మికులకు మద్దతు పలికారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రాత్రంతా మహిళా కార్మికులు ఆందోళన కొనసాగించారు. ప్రస్తుతం అక్కడ మహిళా కార్మికులు ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.