: యాప్ ఆధారిత క్యాబ్ విధానానికి మొగ్గుతున్న ఢిల్లీ ప్రయాణికులు... నిరసనగా సమ్మె చేపట్టనున్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు
ఢిల్లీలో సరి-బేసి విధానం అమలవుతుండడంతో తమ పంటపండిందని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఆశించారు. ఇదే సమయంలో ఆటో, ట్యాక్సీలలో ఆమధ్య చోటుచేసుకున్న కొన్ని దురదృష్టకర సంఘటనలతో ఢిల్లీలో ఆటో లేదా ట్యాక్సీ ఎక్కాలంటే ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులకు డిమాండ్ పెరిగింది. దీనికి తోడు కార్ పూలింగ్ యాప్ కూడా వినియోగదారులకు కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ఆటోలు, ట్యాక్సీలకు గిరాకీ పడిపోయింది. దీంతో యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళన బాటపట్టనున్నారు. ఢిల్లీలో 13 వేల నలుపు-పసుపు ట్యాక్సీలు, 81 వేల ఆటోరిక్షాలు నడుస్తున్నాయని, యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల ద్వారా వీరంతా ఆందోళన చెందుతున్నారని ఢిల్లీ ఆటో రిక్షా సంఘం జనరల్ సెక్రటరీ రాజేంద్ర సోనీ తెలిపారు.