: వెండితెరను షేక్ చేస్తున్న 'జంగిల్ బుక్'
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ లలో టాప్ హీరోల సినిమాలు రిలీజైతే ఇతర సినిమాల వసూళ్లకు గండిపడాల్సిందే. అలాంటిది తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజైన ఓ హాలీవుడ్ సినిమా భారత్ లో రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా విడుదలైన వారం రోజుల్లో 74.08 కోట్ల రూపాయలను వసూలు చేసి వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ సినిమాలో స్టార్ హీరోలు కానీ హీరోయిన్లు కానీ లేకపోవడం విశేషం. భారత సంతతికి చెందిన నీల్ సేథీ ఈ సినిమాలో నటించాడు. అతను తప్ప మరో నటుడు ఈ సినిమాలో కనిపించడు. ప్రముఖ కామిక్ స్టోరీ 'మోగ్లీ' స్పూర్తితో రూపొందిన 'ది జంగిల్ బుక్' కథ భారత్ లోని వివిధ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్నీ అలరిస్తోంది. ఓ నల్ల పిల్లికి దొరికిన పిల్లాడ్ని అడవిని దాటించాలని భావించడం ఈ సినిమా కథ. ఈ సినిమాలో పెద్దపులి, నక్కలు, కొండచిలువ, ఎలుగుబంటి, ఏనుగులు, కోతులు ఇలా కనిపించే ప్రతి పాత్ర ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. అందుకే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తోంది.