: 5 గంటల్లో 500 కార్లకు ఫైన్... పండగ పూట ఈ బాదుడేంటని ఢిల్లీ వాసుల ఆగ్రహం!
ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికంటూ కేజ్రీవాల్ సర్కారు 'సరి-బేసి' విధానం మలి దశను నేటి నుంచి అమలు చేస్తున్న వేళ, ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. నేడు బేసి సంఖ్య ఉన్న కార్లు మాత్రమే వీధుల్లోకి రావాల్సి వుండగా, తొలి ఐదు గంటల వ్యవధిలో 500కు పైగా సరిసంఖ్య కార్లు రోడ్లపైకి వచ్చాయి. వీటిని ఆపిన ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఒక్కో కారుకు రూ. 2 వేల జరిమానా విధించామని, దీన్ని చెల్లించేందుకు పక్షం రోజుల వ్యవధి ఇచ్చామని తెలిపారు. వీరిలో చాలా మంది శ్రీరామనవమి జాతీయ సెలవు దినం కాబట్టి నిబంధనల అమలు ఉండదని భావించామని చెప్పగా, మరికొందరు 40 డిగ్రీల వేడిలో సరైన రవాణా సేవలు అందక తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చిందని తెలిపారు. పలువురు శ్రీరామనవమి రోజున ఈ బాదుడేంటని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.