: థార్ ఎడారిలో కవ్వింపు యుద్ధం... సత్తా చాటిన 'శత్రుజీత్'!
శత్రువులు దాడులు జరిపిన వేళ... భారత సైన్యం ఎంత త్వరగా స్పందిస్తుంది? ఏఏ రకాల ఆయుధాలను ఎంత సేపట్లో ప్రయోగానికి సిద్ధం చేస్తుంది? ఎంత మంది ఏ ఆయుధాలతో వస్తే, వారిని మట్టుబెట్టేందుకు ఎంత సమయం పడుతుంది? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం కోసం భారత్ ఓ చిన్న సైజు కృత్రిమ యుద్ధాన్నే సృష్టించింది. దీనికి రాజస్థాన్ లోని థార్ ఎడారిలో పాక్ సరిహద్దు ప్రాంతాలు వేదికయ్యాయి. 'శత్రుజీత్' పేరిట కవ్వింపు యుద్ధాన్ని భారత సైన్యం నిర్వహించింది. ఇందులో భాగంగా, సైనిక దళాలు, తేలికపాటి ఫిరంగుల మోహరింపు వ్యూహాలు ప్రాక్టీస్ చేసింది. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నేతృత్వంలోని సైన్యం, కృత్రిమ అణు, జీవ, రసాయన వాతావరణ పరిస్థితులను కల్పించి వాటిని ఎలా ఎదుర్కోవాలో పరీక్షించి చూసింది. తుది దశ ఎక్సర్సైజులను దల్బీర్ స్వయంగా సమీక్షిస్తారని సైన్యాధికారి ఒకరు తెలిపారు. పాక్ సరిహద్దులకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ కవ్వింపు యుద్ధాన్ని అటు నుంచి పాక్ సైన్యం సైతం గమనించినట్టు సమాచారం. పాక్, తన వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని సంబరపడుతోందని, అయితే, అణు బాంబులను తొలుత ప్రయోగించరాదన్న నియమానికి తాము కట్టుబడే ఉంటామని, ఒకసారి ఇండియాపై బాంబులు ప్రయోగిస్తే, ఆపై ఎటువంటి కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చో ఆ దేశానికి తెలుసునని ఆ అధికారి వ్యాఖ్యానించారు. మొత్తం 3 వేల మందికి పైగా సైనికులు ఈ యుద్ధంలో పాల్గొన్నారు.