: విదేశాల్లో ఉన్నా స్వదేశంలో విధులను వీడని కేంద్ర మంత్రి
ప్రజా ప్రతినిధులు విదేశీ పర్యటనల్లో ఉంటే అక్కడి షెడ్యూల్ తో బిజీబిజీగా గడిపేస్తుంటారు. ఇంకొందరు ఎలాగూ సమయం దొరికింది కదా అని విశ్రాంతి తీసుకునేందుకు మక్కువ చూపుతారు. కానీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు మాత్రం విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ స్వదేశంలో విధులను మాత్రం మరువలేదు. తన ట్విట్టర్ ఖాతా దృష్టికి ఎలాంటి సమస్య తెచ్చినా ఆయన పరిష్కరిస్తుంటారు. తన చెల్లెలు దివ్య ఈ నెల 5 సోనేపట్ రైల్వే స్టేషన్లో కనపడకుండా పోయిందని, తనకు సాయం చెయ్యాలని ఆమె సోదరుడు కేంద్ర మంత్రి ట్విట్టర్ ఖాతాకు జత చేస్తూ ఓ పోస్టు పెట్టాడు. ఆ సమయంలో ఆయన ఫ్రాన్స్, జర్మనీ పర్యటనలో ఉన్నారు. దీంతో వెంటనే స్పందించిన సురేష్ ప్రభు...ఆమెను వెతికి పెట్టాలని రైల్వే, జీఆర్పీ, ఆర్పీఎఫ్, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయం బాధితుడికి తెలిపారు. మీ చెల్లెలిని వెతికేందుకు నాలుగు బృందాలను తయారు చేసి, గాలింపు చేపట్టారని ఆయన ట్వీట్ చేశారు. ఆయన చిత్తశుద్ధికి అంతా అభినందిస్తున్నారు.