: తాను చదివింది ఏడోతరగతే అయినప్పటికీ, రెండు సీట్ల విమానం తయారు చేశాడు!
కృషి, పట్టుదల ఉంటే కనుక శారీరక వైకల్యం వున్నా సాధించలేనిది అంటూ ఉండదని కేరళకు చెందిన సాజి జేమ్స్ (45) నిరూపించాడు. సాజి జేమ్స్ ఏడోతరగతి వరకే చదివాడు. దీనికి తోడు ఆయన బధిరుడు. ఆయన ఎప్పుడూ ఏదో లోకంలో విహరిస్తూ ఉండేవాడు. జేమ్స్ కు సరిగ్గా 14 ఏళ్ల వయస్సున్నప్పుడు ఆయన ఇంటి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు చల్లేందుకు ఓ విమానం పైలట్ వచ్చారు. జేమ్స్ ఆసక్తిని గమనించిన ఆయన ఒకసారి ఇతనిని విమానంలో ఉచితంగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి జేమ్స్ కు విమానం అంటే ఇష్టం. ఎలాగైనా విమానం తయారు చేయాలని భావించి, తన పొలంలో కొంత భాగం అమ్మేశాడు. అలా సమకూరిన డబ్బుతో ఆయన విమానం ఫ్రేమ్ తయారు చేయగలిగాడు. దానికి మోటారు సైకిల్ ఇంజిన్ అమర్చాడు. అది ఎగరలేదు. దీంతో దానిని లక్షన్నరకు ఓ కాలేజీకి అమ్మేశాడు. తరువాత మళ్లీ మరో విమానం తయారు చేశాడు. అది గాల్లో ఎగిరింది. దానికి మరిన్ని మెరుగులుదిద్ది మూడోసారి పూర్తి స్థాయి విమానం తయారు చేశాడు. ఈ రెండు సీట్ల విమానాన్ని తయారు చేసేందుకు ఓ రిటైర్డ్ వింగ్ కమాండర్ సాయం చేశారని అతని భార్య మారియా తెలిపింది. ఆయనకు పైలట్ లైసెన్స్ లేకపోవడంతో 30 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో విమానం నడిపేందుకు అనుమతి లేదని ఆమె చెప్పింది. ఈ విమానం తయారు చేసేందుకు 13 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని ఆమె తెలిపింది. ఈ విమానానికి సాజి-ఎక్స్ ఎయిర్ అని పేరు పెట్టారు.