: ఉగ్రవాదులను అణచివేస్తేనే!... లేదంటే దోస్తీ కటీఫ్!: పాక్ కు అమెరికా హెచ్చరిక


ఓ వైపు ఉగ్రవాద నిర్మూలన పేరిట తన వద్ద పెద్ద ఎత్తున సాయం తీసుకుంటున్న పాకిస్థాన్ నిజ నైజం అగ్రరాజ్యం అమెరికాకు తెలిసొచ్చింది. వెనువెంటనే ఆ దేశం పాక్ కు ఘాటు హెచ్చరికలు జారీ చేస్తూ ఓ లేఖ రాసింది. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాల్సిందేనని, లేని పక్షంలో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ప్రభావం పడుతుందని హెచ్చరికలు జారీ చేసింది. అసలు విషయమేంటంటే... పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్ వర్క్ మధ్య కీలక సంబంధాలున్నట్లు అమెరికా పరిశీలనలో తేలింది. దీంతో రంగంలోకి దిగిన అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ... పాక్ కు ఘాటు హెచ్చరికలతో లేఖ రాసింది. ఉగ్రవాదులు, ఉగ్రవాద కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిపి తీరాల్సిందేనని తేల్చిచెప్పింది. హక్కానీ నెట్ వర్క్ తో పాటు ఆల్ కాయిదా, లష్కరే తోయిబా తదితర ఉగ్రవాద సంస్థలను కూడా అమెరికా తన లేఖలో ప్రస్తావించింది. మరి అమెరికా లేఖకు పాక్ ఏ విధంగా సమాధానం చెబుతుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News