: యూపీ మంత్రికి అమెరికాలో చేదు అనుభవంపై భారత్ నిరసన


ఉత్తరప్రదేశ్ మంత్రి అజామ్ ఖాన్ కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో భారత్ నిరసన వ్యక్తం చేసింది.సమాజ్ వాదీ పార్టీ సభ్యులు తమ నేతకు జరిగిన అవమానం పట్ల లోక్ సభలోనూ నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై అమెరికాలో భారత దౌత్య కార్యాలయ ప్రతినిధి ఎం.శ్రీధరన్ మాట్లాడుతూ, ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు తీవ్ర నిరసన తెలిపామని చెప్పారు. అంతేగాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరామని ఆయన తెలిపారు.

కాగా, ఇలాంటి సంఘటనలు ఇంతకముందూ జరిగాయి. అమెరికా వెళ్ళే భారతీయ ముస్లింలు ఏ స్థాయికి చెందిన వారైనా అక్కడి అధికారుల వైఖరితో చేదు అనుభవాలు చవిచూస్తున్నారు. ఇంతకుముందు, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తో పాటు మరికొందరు భారత రాజకీయ నేతలు కూడా ఇక్కడి విమానాశ్రయాల్లో భంగపాటుకు గురైన వారే. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా దాడుల అనంతరం తమ దేశంలోకి వచ్చే ముస్లింలను క్షుణ్ణంగా తనిఖీలు చేయనిదే వారికి అనుమతి మంజూరు చేయడంలేదు.

రెండ్రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ అజామ్ ఖాన్ కూ ఇదే తరహాలో అమెరికా అధికార వర్గాలు స్వాగతం పలికాయి!యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ హార్వర్డ్ యూనివర్శిటీలో కుంభ మేళా నిర్వహణపై ప్రసంగించేందుకు అమెరికా వెళ్ళగా ఆయనకు తోడుగా అజామ్ ఖాన్ అమెరికా వచ్చారు.

ఆయన ముస్లిం కావడంతో బోస్టన్ విమానాశ్రయం అధికారులు పది నిమిషాల పాటు ప్రశ్నల వర్షం కురిపించిగానీ వదిలిపెట్టలేదు. ఈ సంఘటన పట్ల భారత్ నిరసన తెలిపింది.ఇటీవలే బోస్టన్ పేలుళ్ళు సంభవించిన నేపథ్యంలో అక్కడి అధికారులు దేశంలో ప్రవేశించే ప్రతి వ్యక్తిపైనా నిఘా ఉంచుతున్నారు.

  • Loading...

More Telugu News