: రాజకీయాల్లోకి సోనియా అల్లుడు?... ప్రియాంక చేయూత అవసరం లేదన్న వ్యాఖ్యకు అర్థం అదేనట!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి అల్లుడు రాబర్ట్ వాద్రా... తన రాజకీయ రంగ ప్రవేశం కోసం మార్గం సుగమం చేసుకుంటున్నారు. వ్యాపారవేత్తగా ఉన్న వాద్రా... సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీని వివాహమాడిన తర్వాత ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. ప్రియాంకను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన వ్యాపారమేదో తాను చేసుకుంటూ వెళ్లిన వాద్రా... గత యూపీఏ హయాంలో హర్యానా కేంద్రంగా పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వివాదాల సుడిలో చిక్కుకున్న వాద్రాను కేంద్రంగా చేసుకుని బీజేపీ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారును తూర్పారబట్టింది. ఇదంతా గతం. నిన్న ఏఎన్ఐ వార్తా సంస్థకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఉన్నతికి తన భార్య ప్రియాంక చేయూత ఎంతమాత్రం అవసరం లేదని వాద్రా ప్రకటించారు. అంతేకాక తనకు కావాల్సినవన్నీ తన తండ్రే ఇచ్చారని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా కూడా తన తండ్రి నుంచే నేర్చుకున్నాననీ ఆయన చెప్పుకొచ్చారు. ఇక రాజకీయాల్లోకి ప్రవేశించే విషయంలో తనకేమాత్రం విముఖత లేదని కూడా ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే తాను ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నానన్న విషయాన్ని మాత్రం వాద్రా వెల్లడించలేదు. ప్రజలకు తన అవసరం ఎప్పుడు ఉందనిపిస్తే అప్పుడు తాను రాజకీయ రంగంలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. ‘‘చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో?’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకే తెర లేపాయి. అయినా ఇప్పటికిప్పుడు ఏఎన్ఐ వార్తా సంస్థను పిలిచి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా ఆయన ఆ సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారంటేనే... దాని వెనుక పెద్ద మంత్రాంగమే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.