: పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి ఆస్తి రూ.152 కోట్లు!... ఈ ఆస్తులన్నీ సక్రమమేనట!
నిజమేనండోయ్... పంజాబ్ కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి గుర్ ప్రీత్ సింగ్ భుల్లర్ ఆస్తి అక్షరాలా రూ.152 కోట్లట. ఇదేదో ఆయన తన సన్నిహితుల వద్ద వెల్లడించిన సమాచారం కాదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఐసీఎస్ అధికారులు తెలపాల్సిన ఆస్తుల చిట్టాలో ఆయన ఆ శాఖకు షాకిచ్చేలా వెల్లడించిన ఆస్తుల విలువ. పంజాబ్ లోని మొహాలీ సీనియర్ ఎస్పీగా చాలా కాలం నుంచి పనిచేస్తున్న భుల్లర్... తన ఆస్తి విలువ రూ.152 కోట్లని తెలిపారు. భుల్లర్ ఆస్తుల చిట్టాలో... 8 నివాస భవనాలు, నాలుగు ఫామ్ హౌస్ లు, మూడు కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. ఈ ఆస్తుల చిట్టాలో ఢిల్లీలోని బారాఖండా రోడ్డులోని కమర్షియల్ ప్లాటు విలువ రూ.85 లక్షలుగా ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని సైనిక్ ఫామ్స్ అనే ఖరీదైన 1,500 గజాల ఖాళీ స్థలం కూడా ఉందట. ఇక మొహాలీ సమీపంలోని బరైలీ గ్రామంలో సాగుకు పనికిరాని రూ.45 కోట్ల విలువ చేసే భూమి కూడా ఉంది. తనకున్న ఆస్తుల్లో మెజారిటీ భాగం తన తాతల నుంచి సంక్రమించినవేనని భుల్లర్ తెలిపారు. 2009-13 వరకు ఓ సారి, ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 2015లో మొహాలీ సీనియర్ ఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన ప్రస్తుతం అదే పోస్టులో కొనసాగుతున్నారు. భుల్లర్ వెల్లడించిన ఆస్తుల విలువ ఎంతలేదన్నా రూ.500 కోట్ల పైమాటేనని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.