: ఈసీపై దీదీ ఫైర్!... ప్రజల నుంచి షోకాజ్ నోటీసు తప్పదని హెచ్చరిక!
ఎన్నికల కమిషన్... దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ సంస్థ. ఎన్నికల సమయంలో ఆ సంస్థదే సంపూర్ణ అధికారం. అధికారుల బదిలీల నుంచి అభ్యర్థుల అర్హతలపైనా ఆ సంస్థదే అంతిమ నిర్ణయం. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ నుంచి షోకాజ్ నోటీసు వచ్చిందంటే రాజకీయ నేతలు బెంబేలెత్తిపోతారు. అందుకు భిన్నంగా నిన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... ఎన్నికల కమిషన్ కే సవాల్ విసిరారు. తనకు నోటీసు ఇచ్చిన కమిషన్ కు త్వరలోనే ప్రజల నుంచి షోకాజ్ నోటీసు జారీ కానుందని ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల కమిషన్ వ్యవహారాలను ప్రశ్నించేంత స్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేతలు దేశంలో దాదాపుగా లేరనే చెప్పాలి. అయితే దీదీ మాత్రం ఎన్నికల కమిషన్ ను పూచిక పుల్లలా తీసిపారేశారు. ‘‘బెంగాల్ నూతన సంవత్సరాదిన నాకు నోటిసిచ్చారు. మే 19న ఎన్నికల ఫలితాల రోజు ప్రజలు మీకు (ఎన్నికల కమిషన్) షోకాజ్ నోటీసు ఇస్తారు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. అంగుళం అంగుళం మీ అంతు చూస్తానని ఎన్నికల ప్రచారంలో అన్నాను. అనాలనుకున్నాను. అన్నాను. అదే మళ్లీ మళ్లీ అంటాను. ఏం చేస్తారో చేసుకోండి. నా అధికారిని బదిలీ చేశారు. నన్ను కూడా ఢిల్లీకి బదిలీ చేస్తారా? మీరిక్కడ నన్ను పాతిపెడితే ఢిల్లీలో తేలుతాను. నన్ను భయపెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తాను’’ అని ఆమె ఈసీపై ఫైర్ అయ్యారు.