: జయలలిత ఓటు బ్యాంకును ట్రాన్స్ జెండర్ అభ్యర్థి దేవి దెబ్బతీస్తుందా!
తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జయలలితపై పోటీ చేయనున్న అభ్యర్థి పేరు సి.దేవి. జయలలితకు కంచుకోటగా నిలిచే ఆర్కే నగర్ నుంచి ట్రాన్స్ జెండర్ దేవి బరిలోకి దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జయలలిత గెలుపు ఖాయమనే అంచనాలు ఉన్నాయి. 2015 ఉప ఎన్నికలో తన సమీప ప్రత్యర్థి కన్నా16 రెట్ల ఓట్లు అత్యధికంగా సాధించి భారీ మెజార్టీతో జయలలిత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సారి జరగనున్న ఎన్నికల్లో జయలలిత ఓటు బ్యాంకుకు గండికొట్టాలనే ఉద్దేశంతో దేవి ఉంది. తమిళ జాతీయవాద పార్టీ అయిన ‘నామ్ తమిలార్ కచ్చి’ తరపున బరిలోకి దిగనున్న దేవి గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ కాలినడకనే వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్న దేవి స్థానిక సమస్యలు నీటి కొరత, రేషన్ కార్డులు లేకపోవడం వంటి సమస్యలను ఆమె ప్రస్తావిస్తోంది. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ,‘ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి జయలలిత పోటీ చేస్తారని తెలిసినప్పుడు నేను మొదట్లో భయపడ్డాను. అయితే, మా పార్టీ ఇక్కడ బలంగా ఉంది. దీంతో కొంత ధైర్యం వచ్చింది’ అని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి ట్రాన్స్ జెండర్ అభ్యర్థి అయిన దేవి వయస్సు 33 ఏళ్లు.