: ఆ స్కూల్ లను మూసేద్దామంటున్నారు...మరి అలాంటి శాఖలను కూడా మూసేస్తారా?: టీ-టీడీపీ అధికార ప్రతినిధి
రాష్ట్రంలోని విద్యార్థుల శాతం తక్కువగా ఉన్న స్కూళ్లను మూసి వేసే ప్రభుత్వం, బడ్జెట్ లో తక్కువ కేటాయింపులు ఉన్న శాఖలను కూడా మూసివేస్తుందా? అని టీ-టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రేషనలైజేషన్ కేవలం ఉపాధ్యాయులకేనా? మంత్రులకు ఎందుకు వర్తింపచేయరని ప్రశ్నించారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో బడికి రాని పిల్లలను వారి ఇళ్లకు పోలీసులు వెళ్లి బళ్లకు తీసుకువస్తారని, కేజీ టు పీజీ నిర్బంధ విద్యను అమలు చేస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతం ఎందుకు తగ్గిపోతుందో కారణాలు అన్వేషించలేని అసమర్థ ప్రభుత్వమని ఆయన విమర్శించారు. హైదరాబాదులో కార్లు, నగల షాపుల ప్రారంభోత్సవాలకు హాజరవుతూ వాటికి బ్రాండింగ్ చేస్తున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు, తమ వారసులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చి వాటికి బ్రాండింగ్ చేయాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా టీచర్ల బదిలీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. పాఠశాలల మూసివేతను కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.