: శభాష్ ఇండియా: మిచెల్ ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా భారత్లో బాలికా సాధికారత కోసం తీసుకుంటోన్న చర్యలను ప్రశంసించారు. సంస్కృతి పేరుతో బాలికలను పాఠశాలలకు దూరంగా ఉంచే విధానాన్ని తెంచేస్తూ కొనసాగిస్తోన్న ప్రభుత్వ కార్యక్రమాలను అభినందించారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా, ఇండియా వంటి దేశాలు బాలికల సాధికారత కోసం వారికి ఉచిత విద్య, స్కాలర్షిప్ వంటి ప్రోత్సాహకాలు అందిస్తోన్న కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వరల్డ్ బ్యాంకు ‘లెట్ గర్ల్స్ లెర్న్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బాలికల విద్య ప్రోత్సాహం కోసం ‘లెట్ గర్ల్స్ లెర్న్’ కార్యక్రమం సందర్భంగా ప్రపంచ బ్యాంకు 2.5 బిలియన్ డాలర్లను ప్రకటించింది. కార్యక్రమంలో మాట్లాడిన భారత అమెరికా దౌత్యవేత్త అరుణ్ కే సింగ్.. భారత ప్రభుత్వం బేటీ బచావో..బేటీ పడావో వంటి పథకాల ద్వారా బాలికా విద్యకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలతో పేద బాలికలు సమాజంలో రాణించేందుకు కృషి చేస్తోందని తెలిపారు.