: యూస్ లెస్ పీఎం నవాజ్.. అంటూ ‘ఈబే’లో సేల్ ఆఫర్
ఈ-కామర్స్ వెబ్ సైట్ లో అమ్మకాల నిమిత్తం అనేక వస్తువులుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మరి, మనుషులను కూడా అమ్మేందుకు ఈ వెబ్ సైట్లలో ఉంచుతారా? అంటే, అవుననే సమాధానమే వస్తుంది. ఇందుకు నిదర్శనం అమెరికన్ ఈ-కామర్స్ వెబ్ సైట్ ‘ఈ బే’నే. అందులో అమ్మకానికి ఉంచింది సాదాసీదా వ్యక్తిని కాదు!, ఏకంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను. ఇంతకీ, నవాజ్ షరీఫ్ ను అమ్మకానికి పెట్టిన నెటిజన్ కు ఆయన పరిపాలన నచ్చనట్టుంది. అందుకే, ‘యూస్ లెస్ పాకిస్థాన్ పీఎం నవాజ్ షరీఫ్ ఫర్ సేల్’ అంటూ ఆయన ఫొటోను పెట్టి మరీ ‘ఈబే’ లో ఒక ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనలోని వివరాల గురించి చెప్పాలంటే... * ప్రాథమిక ధర 66,200 పౌండ్లు * కొనుగోలు దారుడే వచ్చి సెంట్రల్ లండన్ నుంచి ఈ ప్రొడక్ట్ ను కలెక్ట్ చేసుకోవాలి * రవాణా ఏర్పాట్ల బాధ్యత కొనుగోలు దారుడిదే * ఈ ప్రొడక్ట్ కొనుగోలు చేసిన వారికి దీంతో పాటు షాబాష్ షరీఫ్(నవాజ్ షరీఫ్ సోదరుడు)ను ఉచితంగా ఇచ్చేస్తామంటూ ఆ ప్రకటనలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతేకాకుండా, ఈ ప్రొడక్ట్ లో, కుటుంబంలో జన్యుపరమై లోపాలు ఉన్నాయని, అవినీతితో భ్రష్టుపట్టిందని, నాటకీయమైన, భావోద్వేగాలతో కూడిన ఉపన్యాసాలను ఈ ప్రొడక్ట్ అందిస్తుందంటూ వ్యంగ్యాత్మక ప్రకటన చేశాడు. కాగా, గతంలో కూడా ఇదే తరహాలో ‘ఈ బే’ లో ఒక ప్రకటన వచ్చింది. అయితే, నాటి ప్రకటనలో బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ ను అమ్మివేస్తున్నామంటూ 65,900 పౌండ్లకు అమ్మకానికి పెట్టారు.